పదేళ్ల వయసున్న శ్వాన్ సింగ్ అనే బాలుడి చదువుకు అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సైన్యంలోని గోల్డెన్ యారో డివిజన్ ముందుకు వచ్చింది. భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆ బాలుడు సైన్యానికి అందించిన సేవలే.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ తారావాలీ గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. శత్రుదేశంతో భారత సైన్యం తలపడుతున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన శ్వాన్ సింగ్ (10) అనే బాలుడు సైనికులకు అండగా నిలిచాడు. మంచినీళ్లు, చాయ్, పాలతో పాటు లస్సీ వంటివి అందిస్తూ సైన్యానికి తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో బాలుడి సేవలను సైనికాధికారులు ప్రశంసించారు. తాజాగా అతడి చదువుకు అయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చారు.
ఫిరోజ్‌పుర్ కంటోన్మెంట్లో నిర్వహించిన కార్యక్రమంలో వెస్ట్రన్ కమాండ్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ ఈ బాలుడిని సత్కరించారు. దేశవ్యాప్తంగా ఇటువంటి వీరులకు సరైన గుర్తింపు, తోడ్పాటు లభించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.