National

దేవుడికి కానుకగా వెండి రివాల్వ‌ర్‌..!

రాజ‌స్థాన్‌లోని చిత్తౌడ్‌గ‌ఢ్‌లోని ప్రసిద్ధ సావ‌రియా సేఠ్ పుణ్య‌క్షేత్రంలోని శ్రీకృష్ణుడికి ఓ అజ్ఞాత భ‌క్తుడు వింత కానుక స‌మ‌ర్పించాడు. వెండి రివాల్వ‌ర్‌, తుపాకీ గుండ్ల‌ను దేవుడికి కానుక ఇచ్చాడు. ఈ రెండూ క‌లిపి దాదాపు అర‌కిలో బ‌రువు ఉంటాయ‌ని ఆల‌య అధికారులు వెల్ల‌డించారు. వీటితో పాటు రెండు వెండి వెల్లుల్లిపాయ‌ల‌ను కూడా ఆ భ‌క్తుడు దేవుడి హుండీలో వేసిన‌ట్లు తెలిపారు.

 

అయితే, దేవునికి ఓ ఆయుధాన్ని కానుక‌గా స‌మ‌ర్పించ‌డం ఇదే మొద‌టిసారి అని ఆల‌య ఛైర్మ‌న్ జాన‌కీదాస్ తెలిపారు. కాగా, గతేడాది రాజ‌స్థాన్ లో వెల్లుల్లిపాయ‌ల‌ ధ‌ర ఆకాశాన్ని తాకింది. బ‌హుశా ఎవ‌రైనా వెల్లుల్లి రైతు భారీగా లాభాలు రావ‌డంతో ఇలా దేవుడికి స‌మ‌ర్పించి ఉండొచ్చ‌ని ఆల‌య ఛైర్మ‌న్ పేర్కొన్నారు.

 

ఇక‌, ఈ ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తులు స్వామివారికి ఇలా విభిన్న కానుక‌లు స‌మ‌ర్పించ‌డం ఇదే తొలిసారి కాద‌ట‌. గ‌తంలో వెండి పెట్రోల్ పంపు, ట్రాక్ట‌రు, ల్యాప్‌టాప్‌, విమానం, ఐఫోన్ వంటి కానుక‌లు కూడా వ‌చ్చాయి. ఇక్క‌డ వెల‌సిన శ్రీకృష్ణుడిని సంప‌ద‌కు అధిప‌తిగా సేఠ్ అని పూజిస్తారు.