వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా నిన్న వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక, సెమీస్‌లో దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడాల్సి ఉంది. అయితే, ఈ సెమీస్ పోరుకు భారీ అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే పాక్‌తో భారత్ ఆడే విషయంపై సందిగ్దత నెలకొనగా.. తాజాగా ఈ టోర్నీ స్పాన్సర్స్ ఈజ్‌మైట్రిప్ ఈ మ్యాచ్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఈ మ్యాచ్‌కు తాము స్పాన్సర్ చేయలేమని ఆ సంస్థ ప్రకటించింది.
ఆ కంపెనీ సహా యజమాని నిశాంత్ పిట్టి ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఉగ్రవాదం, క్రికెట్ ఎప్పటికీ కలిసి నడవలేవు. మాకు దేశమే ముఖ్యం. ఆ తర్వాతే వ్యాపారమని ఆయన ట్వీట్ చేశారు. “ఉగ్రవాదం, క్రికెట్ ఎప్పటికీ కలిసి ముందుకు సాగలేవు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సంబంధాలను పునరుద్దరించడానికి ప్రయత్నించే ఏ ఈవెంట్‌కు మేం మద్దతు ఇవ్వలేము. మా మొదటి ప్రాధాన్యం దేశం. ఆ తర్వాతే వ్యాపారం” అని నిశాంత్ పిట్టి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక, లీగ్ దశలో పాకిస్థాన్‌తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో దాయాదితో ఆడలేమని ఆటగాళ్లు మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశారు. దాంతో ఈ మ్యాచ్‌ను టోర్నీ నిర్వాహకులు రద్దు చేశారు. సెమీస్‌లో మరోసారి ఈ రెండు జట్లు తలపడాల్సి రావడంతో ఇప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. తాజాగా స్పాన్సర్ కూడా తప్పుకోవడంతో నిర్వాహకులు సెమీస్ పోరును మారుస్తారా? లేక పాకిస్థాన్‌ను ఫైనల్ చేర్చుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.