National

నాతో డీల్ చేయండి..! అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..

‘ఆపరేషన్ సిందూర్’పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో డీల్ చేయాలని, ప్రధానమంత్రి వస్తే ఇంకా ఇబ్బందిపడతారంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 

చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనకపోవడాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించారు. అమిత్ షా ప్రసంగిస్తుండగా విపక్షాలు వాకౌట్ చేశాయి.

 

అమిత్ షా మాట్లాడేందుకు నిలబడగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో ప్రధానమంత్రి మాట్లాడాలని డిమాండ్ చేశాయి. పీఎం.. పీఎం అంటూ నినాదాలు చేశాయి.

 

అమిత్ షా స్పందిస్తూ, నరేంద్ర మోదీ కార్యాలయంలోనే ఉన్నారని, ఈ వ్యవహారంపై అన్ని విషయాలను తనతో చెప్పారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

 

ప్రధాని సభకు రాకపోతే సభను అవమానించడమేనని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలోనే ఉండి సభకు రాకపోవడం సరికాదని ఆయన అన్నారు.

 

అమిత్ షా స్పందిస్తూ, ప్రధానమంత్రి గురించి అడిగే వారి బాధను తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆయన కార్యాలయంలోనే ఉన్నారని పేర్కొన్నారు. అన్ని విషయాలపై తాను మాట్లాడి, పూర్తి స్పష్టత ఇస్తున్నప్పుడు ప్రధానమంత్రి నుంచి వినాలని అనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి వస్తే మీకు ఇంకా ఇబ్బంది అవుతుందని సున్నితంగా హెచ్చరించారు.