National

అప్ప‌టివ‌ర‌కు భారత్‌తో చర్చల్లేవ్.. తేల్చిచెప్పిన ట్రంప్..

అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. భారత దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు జరిపేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, రైతుల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు తీవ్ర స్థాయికి చేరినట్లయింది.

 

భారత్ నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 50 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవల్ ఆఫీస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, “లేదు, ఆ వివాదం పరిష్కారమయ్యే వరకు ఎలాంటి చర్చలు ఉండవు” అని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ నేరుగా లేదా ఇతర మార్గాల్లో చమురు దిగుమతి చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇది తమ జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి పెను ముప్పుగా భావిస్తున్నామని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కారణంగానే అత్యవసర ఆర్థిక చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

 

బుధవారం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, ఇప్పటికే ఆగస్టు 7 నుంచి 25 శాతం సుంకం అమల్లోకి రాగా, మరో 21 రోజుల్లో అదనంగా మరో 25 శాతం సుంకం అమల్లోకి వస్తుంది. దీంతో మొత్తం సుంకం 50 శాతానికి చేరుతుంది. అయితే, ఇప్పటికే రవాణాలో ఉన్న వస్తువులకు, కొన్ని ప్రత్యేక కేటగిరీలకు మినహాయింపు ఇచ్చారు.

 

అమెరికా చర్యలపై న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా స్పందించారు. “మాకు రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యం. ఈ విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడదు. దీనికి మేము భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకు తెలుసు. అందుకు నేను సిద్ధం, యావత్ భారత్ సిద్ధంగా ఉంది” అని ఆయన అన్నారు.

 

వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి కీలక రంగాలను అంతర్జాతీయ పోటీకి తెరవడానికి భారత్ చాలాకాలంగా విముఖత చూపుతోంది. లక్షలాది మంది గ్రామీణ జీవనోపాధిని ఇది దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజా పరిణామాలతో ఇరు దేశాలు తమతమ జాతీయ, ఆర్థిక ప్రయోజనాలకే కట్టుబడి ఉండటంతో వాణిజ్య వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.