గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం ఫలప్రదంగా ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన దిశగా గొప్ప పురోగతి సాధించామని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే, తుది ఒప్పందం ఖరారయ్యే వరకు ఏదీ ఖరారైనట్లు కాదని ట్రంప్ స్పష్టం చేశారు.
సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. “మా మధ్య అత్యంత ఫలప్రదమైన చర్చలు జరిగాయి. చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. మేమింకా పూర్తిస్థాయి ఒప్పందానికి రాలేదు, కానీ ఆ దిశగా చేరుకునే అవకాశం బలంగా ఉంది” అని తెలిపారు. ఈ సమావేశ వివరాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి, నాటో మిత్రపక్షాలకు ఫోన్ చేసి వివరిస్తానని ఆయన చెప్పారు. అంతిమంగా ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కూడా పాల్గొన్నారు.
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, నిర్మాణాత్మక వాతావరణంలో చర్చలు జరిగాయని అన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా-రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయని ఆయన అంగీకరించారు. “ఉక్రెయిన్ యుద్ధానికి దారితీసిన మూల కారణాలను తొలగిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ విషయంలో సాధిస్తున్న పురోగతికి ఉక్రెయిన్, యూరప్ దేశాలు ఆటంకాలు కల్పించవద్దని మేము కోరుతున్నాం” అని ఆయన పేర్కొన్నారు. 2022లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగి ఉండేది కాదన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నానని పుతిన్ అన్నారు.
ఈ భేటీలో తదుపరి సమావేశాన్ని మాస్కోలో నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించగా, ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు. “ఇది ఆసక్తికరమైన ప్రతిపాదన. దీనిపై నేను కొంత విమర్శ ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ అది జరిగే అవకాశం ఉంది” అని అన్నారు.