భారత్‌లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. వినియోగదారుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే లక్ష్యంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)తో స్టార్‌లింక్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా స్టార్‌లింక్ సంస్థ ఆధార్ ఆధారిత డిజిటల్ ధ్రువీకరణ (ఈకేవైసీ) విధానాన్ని ఉపయోగించనుంది. భారత్‌లో ఎక్కువ మంది పౌరుల వద్ద ఇప్పటికే ఆధార్ ఉండటం, డిజిటల్ ధ్రువీకరణకు ఇది సమర్థవంతంగా ఉపయోగపడటం వల్ల, ఈ ఒప్పందం ద్వారా స్టార్‌లింక్ కొత్త కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయగలదు. అలానే కస్టమర్ వెరిఫికేషన్‌ను సులభతరం చేస్తుంది. సేవల విస్తరణలో సమయాన్ని ఆదా చేయగలదు.
ప్రపంచ స్థాయి ఉపగ్రహ సాంకేతికతను, భారత విశ్వసనీయ డిజిటల్ గుర్తింపు వ్యవస్థను మిళితం చేయడం సాంకేతిక రంగంలో కొత్త దిశకు నాంది పలుకుతుందని సంస్థ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం స్టార్‌లింక్ సేవల పరిమితులను స్పష్టంగా పేర్కొంది. కంపెనీ గరిష్ఠంగా 20 లక్షల కనెక్షన్లకే సేవలు ఇవ్వవచ్చని, స్పీడ్ పరంగా 200 ఎంబీపీఎస్ వరకు అందించగలదని తెలిపింది.