కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దావణగెరె జిల్లా, చన్నగిరి తాలూకాలోని నల్లూరు గ్రామంలో ఓ సాధారణ నాటు కోడి నీలం రంగులో ఉన్న గుడ్డు పెట్టడమే ఈ ఆశ్చర్యానికి కారణం. ఈ వింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటు కోళ్లను పెంచుకుంటున్నాడు. వాటిలో ఒక కోడి తాజాగా నీలం రంగు గుడ్డు పెట్టడంతో ఆయన ఆశ్చర్యపోయారు. సాధారణంగా తెలుపు గుడ్లను చూసే ఆ ఊరి ప్రజలకు ఈ నీలం గుడ్డు ఓ అద్భుతంగా కనిపించింది. దీంతో ఈ విషయం ఊరంతా పాకి ఆ కోడి, దాని గుడ్డు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
ఈ వింత గుడ్డుపై సమాచారం అందుకున్న చన్నగిరి తాలూకా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్ నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుంది. వారు ఆ కోడిని, గుడ్డును క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని జాతుల కోళ్లలో ఉండే ‘బైలివెర్డిన్’ అనే వర్ణద్రవ్యం (పిగ్మెంట్) కారణంగా గుడ్డు పెంకుకు నీలం లేదా ఆకుపచ్చ రంగు వస్తుందని డాక్టర్ అశోక్ వివరించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని, అయితే గుడ్డు రంగు మారినా దానిలోని పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఒకవైపు అధికారులు శాస్త్రీయ కారణాలు వివరిస్తుంటే, మరోవైపు గ్రామస్థులు మాత్రం దీనిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తున్నారు. ఈ నీలం గుడ్డు తమ గ్రామానికి మంచి చేస్తుందని కొందరు నమ్ముతున్నారు. భవిష్యత్తులో కూడా ఆ కోడి ఇలాంటి గుడ్లనే పెడితే, దానిపై మరింత లోతైన జన్యుపరమైన అధ్యయనాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ కోడి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ అరుదైన సంఘటనతో నల్లూరు గ్రామం వార్తల్లో నిలిచింది.