National

జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ.. ఏవి చౌక? ఏవి ప్రియం?.

పండగ సీజన్ సమీపిస్తున్న వేళ వినియోగదారులకు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు జరుగుతున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పినట్లుగా, ఈసారి ‘దీపావళి గిఫ్ట్’ రూపంలో పన్నుల తగ్గింపు ఉండవచ్చని మార్కెట్ వర్గాల్లో బలమైన అంచనాలు నెలకొన్నాయి.

 

ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శాతం అనే నాలుగు అంచెల పన్ను విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కేవలం రెండు శ్లాబులతో కూడిన సరళమైన విధానాన్ని తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. వస్తువులు, సేవలను ‘మెరిట్’, ‘స్టాండర్డ్’ అనే రెండు కేటగిరీలుగా విభజించి, తదనుగుణంగా కొత్త పన్ను రేట్లను నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల సామాన్యులు వాడే పలు వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవ‌కాశాలు ఉన్నాయి.

 

ఏవి చౌక కానున్నాయి?

తాజా ప్రతిపాదనల ప్రకారం, 1200సీసీ లోపు చిన్న కార్లు, 350సీసీ లోపు మోటార్‌సైకిళ్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించవచ్చు. సబ్బులు, షాంపూలు, నూనెలు వంటి నిత్యావసరాలు 18 శాతం నుంచి 5 శాతం శ్లాబులోకి మారవచ్చు. పన్నీర్, ఐస్‌క్రీమ్, పండ్ల రసాలు, హోటల్ గదులు, సినిమా టికెట్లపై కూడా పన్ను భారం తగ్గనుంది. క్యాన్సర్ మందులపై జీఎస్టీని పూర్తిగా మినహాయించే అవకాశం ఉంది.

 

ఏవి ప్రియం కానున్నాయి?

అయితే, కొన్ని వస్తువులు, సేవల ధరలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ధర ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. రూ. 2,500 కంటే ఎక్కువ విలువైన దుస్తులు కూడా ప్రియం కానున్నాయి. మరోవైపు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, లగ్జరీ ఆటోమొబైల్స్ వంటి వాటిపై 40 శాతం ‘సిన్ ట్యాక్స్’ విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

 

ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 50,000 కోట్ల ఆదాయం తగ్గినా, దేశీయంగా కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సమావేశంలో ఆమోదం పొందిన కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రావచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.