భారత్, సింగపూర్ మధ్య సంబంధాలు కేవలం దౌత్యపరమైన అంశాలకే పరిమితం కాదని, ఇరు దేశాల భాగస్వామ్యం సాంప్రదాయ రంగాలను దాటి అత్యాధునిక సాంకేతిక రంగాల వైపు శరవేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో కలిసి గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా, శాంతి, శ్రేయస్సు అనే ఉమ్మడి దార్శనికతతో ముందుకు సాగుతున్నాయని మోదీ అన్నారు.
సింగపూర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లారెన్స్ వాంగ్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత లభించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, “భారత్ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో సింగపూర్ ఒక కీలకమైన స్తంభం లాంటిది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం ఆసియాన్‌తో కలిసి పనిచేయడం కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు.
భవిష్యత్ భాగస్వామ్యం కోసం ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఇకపై సహకారం అధునాతన తయారీ, గ్రీన్ షిప్పింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ, పట్టణ నీటి నిర్వహణ వంటి నూతన రంగాలకు విస్తరిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా సింగపూర్ సహకారంతో చెన్నైలో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రం ద్వారా అధునాతన తయారీ రంగంలో అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దుతామని వివరించారు.
డిజిటల్ కనెక్టివిటీలో భాగంగా ఇప్పటికే విజయవంతమైన యూపీఐ-పేనౌ అనుసంధానంలో కొత్తగా మరో 13 భారతీయ బ్యాంకులు చేరినట్లు మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంతో (CECA) పాటు, ఆసియాన్‌తో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా నిర్ణీత సమయంలో సమీక్షించాలని ఇరు దేశాలు నిర్ణయించాయని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ ఇరు దేశాల స్టాక్ మార్కెట్లను కలుపుతూ ఒక వారధిగా నిలుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆగ్నేయాసియాలో సింగపూర్ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, రక్షణ సంబంధాలు కూడా రోజురోజుకు బలపడుతున్నాయని ఆయన గుర్తు చేశారు