ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లను దొంగిలించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఇదే పని చేస్తోందని, ‘ఓట్ల దొంగ’ వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు అనుకూలంగా ‘ఇండియా’ కూటమికి చెందిన పలువురు ఎంపీలు ఓటు వేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కూటమి ఉమ్మడి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి అనుకున్న దానికంటే తక్కువ ఓట్లు రావడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ పరిణామం కూటమిలోని ఐక్యతపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఉద్ధవ్ శివసేన, డీఎంకే పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచే ఏకంగా 7 ఓట్లు ఎన్డీయే అభ్యర్థికి వెళ్లినట్లు సమాచారం. వీరిలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు, ముగ్గురు ఉద్ధవ్ సేన ఎంపీలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడంతో కొందరు డీఎంకే ఎంపీలు కూడా ప్రాంతీయ అభిమానంతో ఆయనకే ఓటు వేసి ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై కూటమిలో తీవ్ర చర్చ జరుగుతుండగా, దీనిపై అంతర్గత విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.