దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులకు చేసే (పర్సన్-టు-మర్చంట్) యూపీఐ చెల్లింపుల గరిష్ఠ పరిమితిని పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం, నిర్దిష్ట కేటగిరీలలోని ధృవీకరించిన వ్యాపారులకు వినియోగదారులు ఒకే రోజులో గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు చెల్లింపులు జరపవచ్చు.
అయితే, వ్యక్తుల మధ్య (పర్సన్-టు-పర్సన్) జరిగే నగదు బదిలీల పరిమితిలో ఎలాంటి మార్పు లేదని, అది యథావిధిగా రోజుకు రూ. 1 లక్షగానే కొనసాగుతుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. అధిక మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేయడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు పెద్ద మొత్తంలో చెల్లింపుల కోసం చెక్కులు, బ్యాంక్ బదిలీలపై ఆధారపడాల్సి వచ్చేది.
వివిధ రంగాల్లో పెరిగిన పరిమితులు ఇలా ఉన్నాయి…
క్యాపిటల్ మార్కెట్లు, ఇన్సూరెన్స్: ఈ రంగాల్లో పెట్టుబడుల కోసం ఒక్కో లావాదేవీకి పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. రోజువారీ గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షలుగా నిర్ణయించారు.
రుణాలు, ఈఎంఐలు: లోన్ రీపేమెంట్లు, ఈఎంఐ కలెక్షన్ల కోసం ఒక్కో లావాదేవీపై రూ. 5 లక్షలు, రోజుకు గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు చెల్లించవచ్చు.
ప్రయాణ రంగం: ప్రయాణాలకు సంబంధించిన చెల్లింపుల పరిమితిని రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. రోజువారీ పరిమితి రూ. 10 లక్షలుగా ఉంది.
క్రెడిట్ కార్డ్ బిల్లులు: క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులకు ఒక్కో లావాదేవీకి రూ. 5 లక్షలు, రోజుకు రూ. 6 లక్షల వరకు అనుమతి ఇచ్చారు.
నగల కొనుగోళ్లు: నగల కొనుగోళ్ల కోసం లావాదేవీ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. రోజువారీ గరిష్ఠ పరిమితి రూ. 6 లక్షలు.
ప్రభుత్వ సేవలు: ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) పోర్టల్‌లో పన్నులు, ఇతర డిపాజిట్ల చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు.
బ్యాంకింగ్ సేవలు: డిజిటల్ విధానంలో టర్మ్ డిపాజిట్లు చేసేందుకు లావాదేవీ, రోజువారీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు.
ఈ కొత్త మార్పుల వల్ల కీలక రంగాల్లో అధిక విలువ కలిగిన చెల్లింపులకు యూపీఐ మరింత ఉపయోగకరంగా మారుతుందని, దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగం మరింత విస్తృతం అవుతుందని ఎన్‌పీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.