National

భారత్‌కు వచ్చిన తాలిబన్ మంత్రి..!

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు సాగనున్న ఈ పర్యటన, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కీలకమైనప్పటికీ, భారత అధికారులకు ఇది ఒక కొత్త రకమైన దౌత్యపరమైన సవాలును విసిరింది. సమావేశాల సందర్భంగా ఏ దేశపు జెండాను ప్రదర్శించాలనే అంశం ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది.

 

ఈ పర్యటనలో ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, దౌత్య సంప్రదాయం ప్రకారం, అధికారిక సమావేశాల సమయంలో ఇరు దేశాల జాతీయ పతాకాలను ప్రదర్శించాలి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

 

భారత్ ఇప్పటివరకూ తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. దీంతో వారి జెండాకు కూడా ఎలాంటి అధికారిక హోదా లేదు. ప్రస్తుతం ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంపై కూడా గత అష్రఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలోని జెండానే కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, ముత్తాఖీతో జరిగే సమావేశంలో తాలిబన్ల జెండాను ప్రదర్శించడం సాధ్యం కాదు. అదే సమయంలో, భారత జాతీయ పతాకాన్ని మాత్రమే ఉంచితే అది దౌత్య నియమాలకు విరుద్ధం అవుతుంది.

 

ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ముత్తాఖీతో సమావేశమైనప్పుడు, అధికారులు తెలివిగా వ్యవహరించారు. ఆ సమావేశంలో ఇరు దేశాలకు చెందిన ఏ జెండాను ప్రదర్శించకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నది ఢిల్లీలో కావడంతో, ఈ ‘జెండా చిక్కు’ అధికారులకు తలనొప్పిగా మారింది.

 

తాలిబన్ల పాలనను గుర్తించనప్పటికీ, ఆఫ్ఘనిస్థాన్‌తో వాణిజ్యం, మానవతా సహాయం వంటి అంశాలపై భారత్ నెమ్మదిగా సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. ఆఫ్ఘన్ గడ్డను ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మార్చకూడదని భారత్ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో ముత్తాఖీ పర్యటన ఇరుపక్షాల మధ్య సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.