దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలు, శిక్ష ఖరారు కాని సుమారు 4.5 లక్షల మందికి ఓటు హక్కును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్‌లో, ప్రజాప్రాతినిధ్య చట్టం (RPA), 1951లోని సెక్షన్ 62(5) కింద ఖైదీలపై విధిస్తున్న నిషేధం రాజ్యాంగ హామీలకు, అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా ఉందని వాదించారు.
ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉంటుందని, కేవలం నివాసం లేకపోవడం, మతిస్థిమితం కోల్పోవడం లేదా ఎన్నికల సంబంధిత నేరాలకు పాల్పడటం వంటి కారణాలతో మాత్రమే ఆ హక్కును నిరాకరించాలని పిటిషనర్లు పేర్కొన్నారు. వాస్తవానికి శాసనసభ్యులకు వర్తించాల్సిన ఈ నిబంధనను, జైల్లో ఉన్న సాధారణ ఓటర్లందరికీ వర్తింపజేయడం చట్టవిరుద్ధమని వాదించారు.
ఈ నిషేధం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందని, ఇది ఏకపక్షంగా ఉందని పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. “భారత్‌లోని జైళ్లలో 75 శాతానికి పైగా విచారణ ఖైదీలే ఉన్నారు. వారిలో 80 నుంచి 90 శాతం మంది చివరికి నిర్దోషులుగా విడుదలవుతున్నారు. అయినా దశాబ్దాల పాటు వారు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు” అని తెలిపారు.
“జైల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతిస్తున్నప్పుడు, నేరం ఇంకా రుజువుకాని సాధారణ పౌరులకు ఓటు వేసే హక్కును ఎలా నిరాకరిస్తారు?” అని పిటిషనర్లు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,350 జైళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఖైదీల ఓటు హక్కును సులభంగా కల్పించవచ్చని సూచించారు. అనేక దేశాల్లో ఇలాంటి సంపూర్ణ నిషేధం లేదని, పాకిస్థాన్‌లో సైతం విచారణ ఖైదీలకు ఓటు హక్కు ఉందని పిటిషన్‌లో ఉదహరించారు.