శబరిమల ఆలయంలో బంగారం చోరీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆలయ సన్నిధానంలో గర్భగుడి, ద్వార పాలక విగ్రహాలకు బంగారు తాపడం పనులలో ఏకంగా 4.5 కిలోల బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపరిచింది. దీంతో కేరళ హైకోర్టు స్పందించి సిట్ విచారణకు ఆదేశించింది. బంగారు తాపడం పనుల బాధ్యత తీసుకున్న దాత ఉన్నికృష్ణన్ ను విచారించిన అధికారులు.. అతడికి స్థిరమైన ఆదాయమే లేదని తేల్చారు.
బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ గతేడాది ఐటీ శాఖకు సమర్పించిన ఆదాయ వివరాలను పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది. ఇతర దాతలు, కంపెనీలు ఆలయానికి ఇచ్చిన విరాళాలను ఉన్నికృష్ణన్ తానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. శబరిమల ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవోసం బోర్డు (టీడీబీ) విజిలెన్స్ విభాగం నివేదికలోనూ ఇదే విషయం వెల్లడించింది.
సామాజిక సేవ కోసం కామాక్షి ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉన్నికృష్ణన్ బ్యాంకు అకౌంట్లో రూ.10.85 లక్షలు జమ చేసిందని అధికారులు గుర్తించారు. అదేవిధంగా, శబరిమల గుడిలో స్వర్ణ తాపడం పనులకు బళ్లారికి చెందిన వ్యాపారి గోవర్దన్ నిధులు అందజేసినట్లు విచారణలో బయటపడింది. శ్రీకోవెలకు గుమ్మం తానే ఇచ్చానని ఉన్నికృష్ణన్ చెప్పుకున్నా.. బెంగళూరుకు చెందిన వ్యాపారి అజికుమార్ దానిని అందజేయడం గమనార్హం. ఈ ఏడాది అన్నదాన మండప నిర్మాణానికి రూ.10 లక్షలు, అన్నదానం కోసం రూ.6 లక్షలు ఉన్నికృష్ణన్ అందించారు.
2017లోనూ అన్నదానం కోసం రూ.8.20 లక్షల నగదుతో పాటు 17 టన్నుల బియ్యం, 30 టన్నుల కూరగాయలు ఇచ్చినట్టు విజిలెన్స్ నివేదిక తెలిపింది. ఈ విరాళాలను పరిశీలించి గర్భగుడి స్వర్ణ తాపడం పనులను ఉన్నికృష్ణన్ కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అయితే, స్వర్ణ తాపడం పనులు పూర్తయిన తర్వాత స్వామి వారికి చెందిన బంగారంలో 4.5 కిలోలు మాయమైనట్లు తేలడంతో గందరగోళం నెలకొంది. ఈ కేసులో ఉన్నికృష్ణన్ ను ఏ1 నిందితుడిగా పేర్కొన్న సిట్.. టీడీబీకి చెందిన పలువురు అధికారులను ఇతర నిందితులుగా చేర్చింది.
అసలేం జరిగిందంటే..
2019లో శబరిమల అయ్యప్ప గర్భగుడికి టీడీబీ స్వర్ణ తాపడం చేయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఇందుకోసం వెచ్చించింది. ఈ స్వర్ణ తాపడానికి అయ్యే ఖర్చును భరించి, పనులు చేయించే బాధ్యతను ఉన్నికృష్ణన్ కు టీడీబీ అప్పగించింది. పనులు పూర్తయ్యాక స్వర్ణ తాపడం కోసం అప్పగించిన బంగారం లెక్కల్లో తేడా వచ్చింది. ప్రాథమిక విచారణలో మొత్తం 4.5 కిలోల బంగారం మాయమైనట్లు తేలింది.

