ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం (ఎయిర్ క్వాలిటీ) తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం కృత్రిమంగా వర్షం కురిపించే ‘క్లౌడ్ సీడింగ్’ సాంకేతిక విధానాన్ని చేపట్టింది. మేఘాలలో రసాయనాలను చల్లి వర్షం కురిపించే ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే రెండు దశల్లో ట్రయల్స్ పూర్తయ్యాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దిగజారిన నేపథ్యంలో, మేఘాల నుంచి వర్షాన్ని తెప్పించేందుకు ఈ సీడింగ్ ప్రక్రియను నిర్వహించారు. అయితే, మేఘాలు దట్టంగా లేకపోతే సీడింగ్ ఫలితం తక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
ఈ రెండో క్లౌడ్ సీడింగ్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ సహకారంతో సెస్‌నా విమానం సాయంతో నిర్వహించారు. ఈ విమానం మీరట్ దిశ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించి ఖేక్రా, బురారి, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ ప్రాంతాల మీదుగా ప్రయాణించింది. ఈ ప్రక్రియలో మొత్తం ఎనిమిది ఫ్లేర్స్‌ను ఉపయోగించారు. ప్రతి ఫ్లేర్ బరువు 2-2.5 కిలోల మధ్య ఉండగా, వీటిని మేఘాలలోకి రసాయన పదార్థాన్ని విడుదల చేయడానికి ఉపయోగించారు.
ఈ ప్రక్రియ సుమారు అరగంట పాటు కొనసాగింది. ఈ సమయంలో మేఘాలలో తేమ 15-20% వరకు ఉందని ఢిల్లీ మంత్రి మజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఒక ఫ్లేర్ 2-2.5 నిమిషాలు పనిచేసిందని ఆయన వివరించారు. ఈ క్లౌడ్ సీడింగ్ కారణంగా ఇవాళ ఢిల్లీలో వర్షాలు కురవనున్నాయని భావిస్తున్నారు. ఈ ప్రయత్నం ఢిల్లీలో కాలుష్య స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

