National

నెట్టింట ఏఐ అరాచకాలు: మోదీ, మైథిలీ ఠాకూర్‌లపై అసభ్యకర మార్ఫింగ్ చిత్రాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ, ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి దేశంలోనే అత్యంత పిన్న వయస్సు గల ఎమ్మెల్యేగా నిలిచిన మైథిలీ ఠాకూర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలైంది. కొందరు అసాంఘిక వ్యక్తులు ఏఐని ఉపయోగించి ఆమెపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన చిత్రాలు మరియు వీడియోలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ ఏఐ జనరేటెడ్ ఫొటోలలో మైథిలీ ఠాకూర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌లతో పెళ్లి అయినట్లు జంటగా చూపించారు. అంతేకాకుండా, మోదీ, మైథిలీ ఠాకూర్‌లకు సంబంధించిన దారుణమైన వీడియోలను కూడా ఏఐతో రూపొందించి వ్యాప్తి చేస్తున్నారు.

‘జిద్దీ పవన్ అహిర్’ అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ ఏఐ ఫొటోలను షేర్ చేయడంతో అవి పెను సంచలనంగా మారాయి. దీనిపై ‘శుభం శుక్లా’ అనే సోషల్ మీడియా యూజర్ అభ్యంతరకర పోస్ట్‌ల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసి, నిందితుడి చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ పోస్ట్‌ను బీహార్ పోలీసులకు ట్యాగ్ చేసి, యువ మహిళా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇంత అసభ్యకరమైన పోస్టులు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సంఘటన సైబర్ క్రైమ్ అని, ఐటీ చట్టం కింద నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.

నెటిజన్ల నుంచి పెరుగుతున్న ఆగ్రహం నేపథ్యంలో, బిహార్ పోలీసులు ఈ పోస్ట్‌లపై స్పందించారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవడానికి ఆ ప్రొఫైల్ యొక్క కచ్చితమైన యూఆర్‌ఎల్ లేదా ఇతర సంబంధిత సమాచారాన్ని అందించాలని పోలీసులు రిప్లై ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, దానిని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి అరాచకాలు పెరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.