కేంద్ర ప్రభుత్వం దేశంలో వలస పాలన (British Colonial) వారసత్వాన్ని తొలగించే ప్రక్రియలో భాగంగా, దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్‌ల పేర్లను లోక్ భవన్‌లుగా మార్చాలని నిర్ణయించింది. అలాగే, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును కూడా ‘సేవా తీర్థ్’ గా నామకరణం చేసింది. ప్రజలకు దగ్గరగా ఉండే ‘లోక్’ (ప్రజలు) అనే పదాన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో హోం మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
ఈ మార్పులు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమలులోకి వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం, రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా, రాజ్ నివాస్‌ను లోక్ నివాస్‌గా మార్చింది. ఈ మార్పు తక్షణమే అమలులోకి వచ్చినట్లు గవర్నర్ ఆఫీస్ నుంచి విడుదలైన ప్రెస్ రిలీజ్ ప్రకారం తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఒడిశా వంటి అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ పేరు మార్పును అమలు చేశాయి.
ఈ పేరు మార్పును మోదీ ప్రభుత్వం వలస పాలన వారసత్వాన్ని తొలగించే ప్రక్రియలో భాగంగా చూస్తోంది. గతంలో కూడా రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా మార్చడం, అధికారిక కమ్యూనికేషన్‌లలో ‘ఇండియా’కు బదులు ‘భారత్’ ఉపయోగించడం వంటి చర్యలు ఇందులో భాగమే. ఈ మార్పులు ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యతనిచ్చి, పరిపాలనా కేంద్రాలు ‘సేవ’ మరియు ‘కర్తవ్యం’ స్ఫూర్తిని ప్రతిబింబించేలా చేయాలనే లక్ష్యంతో చేపట్టారు.

