ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యా, చైనా చేసిన విజ్ఞప్తులను అమెరికా తోసిపుచ్చింది. ఈ ఘర్షణ పూర్తిగా టెహ్రాన్ అణు కార్యక్రమం, సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోందని, ఇందులో ఇతరుల ప్రమేయం అవసరం లేదని స్పష్టం చేసింది. బుధవారం నాడు పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మాట్లాడారు. ఈ విషయంలో బీజింగ్ లేదా మాస్కోతో తాము చర్చించడం లేదని, ప్రస్తుత ఘర్షణలో వారి ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు. “వారికి నేనిచ్చే సందేశం ఏమీ లేదు.. ఈ విషయంలో వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు” అని హెగ్సెత్ వ్యాఖ్యానించారు.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో అమెరికా సైన్యం చేపట్టిన దాడులు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ ఆస్తులు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, జనరల్ డాన్ కెయిన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు. ఈ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి ప్రయోగాలు 86 శాతం తగ్గాయని వివరించారు.
అణు కార్యక్రమంపై ఇరాన్ నిజాయతీగా చర్చలు జరపడం లేదని తమ నిఘా వర్గాలు నిర్ధారించుకున్న తర్వాతే ఈ సైనిక చర్య ప్రారంభించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇరాన్ వద్ద తమపైకి ఎక్కుపెట్టిన వేలాది క్షిపణులు ఉన్నాయని హెగ్సెత్ ఆరోపించారు. ఈ ఆపరేషన్ లక్ష్యం ఇరాన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమేనని అమెరికా స్పష్టం చేసింది.
ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులనుంచి రక్షణ కోసం సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి మధ్యప్రాచ్య దేశాలు సహాయం అందిస్తున్నాయని పెంటగాన్ వెల్లడించింది. అయితే, ఈ యుద్ధంలో ప్రాథమికంగా పైచేయి సాధించినప్పటికీ, ఇది ఇంకా తొలిదశలోనే ఉందని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు. “మనం 100 గంటల యుద్ధంలో ఉన్నాం. ఇది ఇంకా చాలా ప్రాథమిక దశ” అని జనరల్ కెయిన్ పేర్కొన్నారు.

