National

ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు..

పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడుకుతున్న సముద్ర మార్గంలో భారత నౌకాదళం పటిష్ట భద్రత నడుమ మూడు కీలక ఇంధన నౌకలు భారత్‌కు బయల్దేరాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠి తన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు.

 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం యూఏఈ నుంచి రెండు ఎల్పీజీ క్యారియర్లు, సౌదీ అరేబియా నుంచి ఒక ముడిచమురు నౌక భారత్‌ వైపు ప్రయాణిస్తున్నాయి. భారత జెండాతో ఉన్న ‘ఎంవీ జగ వసంత్’, ‘ఎంవీ పైన్ గ్యాస్’ అనే రెండు ఎల్పీజీ నౌకలు సోమవారం ఉదయం యూఏఈ పోర్టుల నుంచి బయల్దేరాయి. అత్యంత కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతి ఇవ్వడంతో ఈ నౌకలు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ రెండు నౌకల్లో కలిపి 92,612 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. వీటిలో 33, 27 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లో ప్రవేశించాక, భారత నౌకాదళ యుద్ధనౌకలు వీటికి 24 గంటల పాటు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తాయి. ‘ఎంవీ జగ వసంత్’ ఈ నెల‌ 26న కాండ్లా పోర్టుకు, ‘పైన్ గ్యాస్’ ఈ నెల‌ 26న న్యూ మంగళూరు పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది.

 

మరోవైపు సౌదీ అరేబియాలోని యన్బు పోర్టులో ‘ఎంటీ కల్లిస్టా’ అనే ముడిచమురు నౌక లోడింగ్ పూర్తి చేసుకుని ఇవాళ‌ భారత్‌లోని పారాదీప్ పోర్టుకు బయల్దేరనుంది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మీదుగా సాగే ఈ నౌక ప్రయాణంలోనూ భారత నౌకాదళం భద్రత కల్పిస్తుంది. హ‌ర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఒక్కో నౌకకు 2 మిలియన్ డాలర్లు ఇరాన్ డిమాండ్ చేస్తోందన్న వార్తలను ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. నౌకల ప్రయాణానికి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. అయితే, తమ జలసంధిలో భారత యుద్ధనౌకల ఎస్కార్ట్‌కు ఇరాన్ అనుమతించడం లేదు.

 

గల్ఫ్‌లో నిరంతరం జరుగుతున్న దాడుల కారణంగా అక్కడి నౌకల్లోని భారత సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వారికి ధైర్యం చెప్పేందుకు నౌకాదళ అధికారులు, నౌకల యజమానులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. భారత జెండా ఉన్న నౌకల భద్రత కోసం కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్లను గల్ఫ్ ఆఫ్ ఒమన్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతాల్లో మోహరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నౌకాదళాన్ని ఆదేశించింది. సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భారత నౌకల కెప్టెన్లకు భరోసా ఇస్తున్నారు.