ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలలో భారీ మార్పులు జరగనున్నాయనే ఊహాగానాల మధ్య, ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఒక సంచలనాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోహిత్‌ను జట్టులోకి తెచ్చుకోవడానికి డేంజరస్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చేందుకు కూడా ఎస్ఆర్‌హెచ్ సిద్ధమవుతోందనే రూమర్స్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.
ముంబై ఇండియన్స్ చరిత్రలో రోహిత్ శర్మ శకం ఎంతో గొప్పది. ఆయన కెప్టెన్సీలో ముంబై ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను (2013, 2015, 2017, 2019, 2020) గెలుచుకుంది. అయితే, ఐపీఎల్ 2023 తర్వాత రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడంతో, రోహిత్ అభిమానులు ముంబై మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తిగా ఉన్నారు. గత సీజన్‌లో రోహిత్‌ను కొన్ని మ్యాచ్‌లలో పక్కన పెట్టడం, మరికొన్నింటిలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం వంటి పరిణామాలు జరిగాయి, దాంతో రోహిత్ ఫ్రాంఛైజీ మారాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన దక్కన్ ఛార్జర్స్ (అప్పటి హైదరాబాద్ టీమ్) తో ఉన్న అనుబంధం కారణంగా, మళ్లీ హైదరాబాద్‌లోని సన్‌రైజర్స్‌లోకి రోహిత్‌ను తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ మాతృభాష తెలుగే కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ఈ మెగా స్వాప్ గనుక జరిగితే, శర్మలతో సన్‌రైజర్స్ ఓపెనింగ్ పెయిర్ మరింత పటిష్టమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

