స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరో ముప్పు వచ్చి పడిందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా స్పార్క్ క్యాట్ అనే వైరస్ స్మార్ట్ ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని కాజేస్తోందని, తద్వారా తీవ్ర నష్టం కలుగజేస్తోందని అంటున్నారు.
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘కాస్పర్ స్కై’ చెబుతున్న వివరాల ప్రకారం… ఈ స్పార్క్ క్యాట్ వైరస్ మాల్వేర్ రకానికి చెందినది. ఇప్పటికే దీన్ని 28 యాప్ లలో గుర్తించారు. వీటిలో 10 ఆండ్రాయిడ్ యాప్ లు కాగా, మిగిలిన 8 ఐఓఎస్ యాప్ లు. ఈ స్పార్క్ క్యాట్ వైరస్ ఫోన్లలోని స్టోరేజిలోకి వెళ్లి స్క్రీన్ షాట్లను, ఇతర ఇమేజ్ లను స్కాన్ చేయడం ద్వారా డేటా తస్కరిస్తుంది. ముఖ్యంగా, ఫోన్లలోని క్రిప్టో కరెన్సీ వివరాల గురించి శోధిస్తుంది.
ఇది ఎంత తెలివైనది అంటే… అనేక ప్రపంచ భాషలను చదవగలుగుతుంది. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) టెక్నాలజీ ఉపయోగించి ఇమేజ్ లలో ఉన్న టెక్ట్స్ ను సంగ్రహిస్తుంది. ఆ వివరాలను హ్యాకర్లకు చేరవేస్తుంది. అందుకే, ఇటీవలే ఏవైనా అనుమానాస్పద థర్డ్ పార్టీ యాప్ లను ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే, వాటిని తొలగించాలని నిపుణులు చెబుతున్నారు.