TELANGANA

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందనే విషయాన్నీ కేసీఆర్ స్పష్టం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవ్వాళ ముగియనున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రసంగిస్తోన్నారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలు, ఇతర అంశాలను ఆయన ప్రస్తావించారు.

రాష్ట్రాభివృద్ధి విషయానికి సంబంధించిన విషయాలను కేసీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందనే విషయాన్నీ కేసీఆర్ స్పష్టంగా సభకు వివరించారు. ప్రజా రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీసీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను రవాణా శాఖ మంత్రిగా పని చేశానని, బాధ్యతలు తీసుకునే సమయానికి ఏపీఎస్ఆర్టీసీ 1,400 కోట్ల రూపాయల నష్టాల్లో ఉండేదని అన్నారు.

సంస్థ నష్టాన్ని పూడ్చుతూ, మళ్లీ 1,400 కోట్ల లాభాల్లోకి తీసుకుని రాగలిగామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు టీఎస్ఆర్టీసీనీ లాభాల్లోకి తీసుకుని రావడానికి బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్‌ను సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా అపాయింట్ చేశామని, అనుభవజ్ఞుడైన బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఛైర్మన్‌గా నామినేట్ చేశామని వివరించారు.

ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా.. డీజిల్ ధరలు అసాధారణంగా పెరగడం వల్ల సంస్థ నష్టాలపాలవుతోందని కేసీఆర్ అన్నారు. డీజిల్ ధరలను నిర్ధారించే మెకానిజం తమ చేతుల్లో లేదని, అది కేంద్రం పరిధిలో ఉందని పేర్కొన్నారు. ప్రతి రోజూ 40, లక్షల కిలోమీటర్ల మేర తిరిగే టీఎస్ఆర్టీసీ బస్సులు.. ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోన్నాయని అన్నారు.

లీటర్ ఒక్కింటికి 60 రూపాయలు ఉన్న డీజిల్.. ఇప్పుడు 105 రూపాయల వరకు చేరిందని, దీనివల్ల రోజుకు రెండున్నర కోట్ల రూపాయలను డీజిల్ కొనుగోళ్లకే ఖర్చు చేయాల్సి వస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటప్పుడు ఆర్టీసీ ఎలా లాభాల్లోకి వస్తుందని ప్రశ్నించారు. అందుకే- అయిదారు గంటల పాటు కేబినెట్‌లో చర్చించిన తరువాతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించామని అన్నారు.

ఆర్టీసీని తీసేద్దామా? అంటే ఆ పరిస్థితి లేదని, ప్రజా రవాణాను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వమే పోషించాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని తామే చెప్పామని, పరిస్థితులు, ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని విలీనం చేశామని అన్నారు. అనంతరం ఈ బిల్లును సభ ఆమోదించింది.