తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్ కు అస్సలు పొసగడం లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి, సీఎం కేసీఆర్ కి అస్సలు పడటం లేదు.
మొన్న ఆగస్టు 15న రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ రాలేదు. గవర్నర్ ఆహ్వానించినా కేసీఆర్ రాలేదు. అలాగే.. ప్రభుత్వం నుంచి నిర్వహించే పలు ముఖ్య కార్యక్రమాలకు కూడా గవర్నర్ రావడం లేదు. ఆమె హాజరు కావడం లేదు. చాలా రోజుల నుంచి ఈ రగడ సాగుతూనే ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ఏదైనా బిల్లును తీసుకొస్తే ఆ బిల్లును కావాలని గవర్నర్ అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల ఆర్టీసీ బిల్లుపై కూడా అదే రచ్చ నడిచింది. గవర్నర్ కావాలని ఆర్టీసీ బిల్లుపై సంతకం పెట్టలేదని రచ్చ చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఒకరోజు బంద్ కి పిలుపునిచ్చారు. చివరకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపిన గవర్నర్ కు బిల్లుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అయితే.. గవర్నర్ ఎప్పుడు ఆ ఫైల్ మీద సంతకం పెడితే అప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు కాస్త ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. కానీ.. గవర్నర్ మాత్రం ఇప్పటి వరకు సంతకం పెట్టలేదు. అలాగే.. ఆ బిల్లును న్యాయ సలహా కోసం న్యాయ శాఖ కార్యదర్శికి పంపించినట్టు రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. తాను చేసిన సిఫారసులను బిల్లులో పరిగణనలోకి తీసుకున్నారా లేదా అనే దానిపై పరిశీలన చేయాలని న్యాయ శాఖ సాయం కోరినట్టుగా తెలుస్తోంది. ఇదంతా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసమే అని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా కూడా ఆర్టీసీ ఆస్తులు అలాగే ఉండాలని.. ఉద్యోగుల శ్రేయస్సు కోసం, కార్పొరేషన్ బాగు కోసమే గవర్నర్ ఆ బిల్లులో పలు మార్పులు సూచించారని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని బెనిఫిట్స్ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అందాలని, దానికి తగ్గట్టుగానే బిల్లు ఉండాలని గవర్నర్ భావిస్తున్నారట. అందుకే న్యాయ శాఖ సలహా కోసం ఆ బిల్లును ఆమె పంపించారట. చూద్దాం మరి ఆ బిల్లుపై ఆమె ఎప్పుడు సంతకం పెడతారో?