TELANGANA

టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ త్వరలోనే ఐపీవో

టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ త్వరలోనే ఐపీవోకు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే భారత్ లో ఇదే అతి పెద్ద ఐపీవో అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవలే టాటా సన్స్ ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా వర్గీకరించింది. ఈ కేటగిరిలోకి వచ్చిన ఏ కంపెనీ అయినా నిబంధన ప్రకారం మూడు సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లలో లిస్టవ్వాలి.

సెప్టెంబరు 14వ తేదీన టాటా సన్స్ ను ఆర్బీఐ అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా వర్గీకరించింది. 2025 సెప్టెంబరు 14వ తేదీకల్లా ఐపీవో ప్రక్రియ పూర్తిచేసుకొని స్టాక్ మార్కెట్ లో లిస్టవ్వాలి. అలాగే మరో టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇలాగే వర్గీకరణ పొందింది. ఇది టాటా సన్స్ లో విలీనం కానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఐపీవోకు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేటగిరిలో చేరిన కంపెనీలపై నియంత్రణ చర్యలు చాలా కఠినంగా ఉంటాయి.

ప్రస్తుతం టాటా సన్స్ కంపెనీ విలువ రూ.11 లక్షల కోట్లుగా అంచనా ఉంది. ఇందులో 5 శాతం వాటాలను విక్రయించాలనుకున్నా ఐపీవో రూ.55వేల కోట్లు అవుతుంది. ఇదే జరిగితే దేశంలో ఇదే అతి పెద్ద ఐపీవో అవుతుంది. ప్రస్తుతానికి రూ.21వేల కోట్లు సమీకరించిన ఎల్ఐసీ ఐపీవోనే దేశంలో పెద్దది.

ఐపీవో కాకుండా టాటా సన్స్ కు మరో మార్గం కూడా ఉంది. ఐపీవో వద్దనుకుంటే కంపెనీని పునర్వ్యవస్థీకరించడంవల్ల ఆర్బీఐ నిబంధనల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంది. అయితే టాటా సన్స్ విషయంలో అలా జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.