రాయ్‌పూర్: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది.
వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో వరుస భేటీలు ఏర్పాటవుతున్నాయి.
అధికార బీజేపీ- ఎన్డీఏ దూకుడును అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రాగలిగింది. ఇండియా పేరుతో ప్రతిపక్ష పార్టీలతో ఉమ్మడి ఐక్య కూటమిని ఏర్పాటు చేసుకుంది. వారికి దిశానిర్దేశం చేసే బాధ్యతలను స్వీకరించింది కాంగ్రెస్. ఉమ్మడిగా ఎన్డీఏను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోంది.
ఈ పరిణామాల మధ్య- రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా పర్యటించారు. ఓ సాధారణ పౌరుడిలా కలియతిరిగారు. ఈ సాయంత్రం ఆయన బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు రైలులో ప్రయాణించారు. ప్రయాణికులను కలిశారు. వారితో ముచ్చట్లు పెట్టారు. వారికి కావాల్సిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులతో కూర్చుని వారు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించారు.
ఆ సమయంలో రాహుల్ గాంధీ వెంట- ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుమారి సెల్జా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ దీపక్ బైజ్ సహా పలువురు నేతలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ ఏకంగా 2,600 రైళ్లను రద్దు చేసిందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
అంతకుముందు బిలాస్‌పూర్ జిల్లాలోని తాఖత్‌పూర్‌లో పర్యటించారు రాహుల్ గాంధీ. ఆవాస్ న్యాయ సమ్మేళన్‌కు హాజరయ్యారు. జనాభా గణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా లెక్కలను దేశ ఎక్స్‌రేగా అభివర్ణించారు. దేశంలో ఎంతమంది ఓబీసీలు, గిరిజనులు, సాధారణ వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారో అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.