కామారెడ్డి గడ్డపై నుంచి జంగ్ సైరన్ మోగించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కారు జోరుకు కామారెడ్డి నుంచే బ్రేక్ పడబోతుందని పిలుపునిస్తూ ఆశేష జనవాహిని వెంటరాగా.. కాంగ్రెస్ బలం, బలగాన్ని చాటిచెప్పారు. నామినేషన్ వేయడంలో లాస్ట్ కావచ్చు కానీ.. విక్టరీ కొట్టేది ఫస్ట్ మనమే అంటూ హస్తం నేతల్లో జోష్ నింపుతూ.. గులాబీ నేతల్లో గుబులు రేపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల యుద్ధంలో కీలక ఘట్టం ఇది. వేలాది మంది వెంటరాగా.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తోడురాగా.. బలం, బలగాన్ని చాటుతూ కామారెడ్డి వైపు కదిలింది కాంగ్రెస్ దండు..
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా ఉన్నాయి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడుగులు. సొంత నియోజకవర్గంలో కాదు.. ఏకంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పోటీ చేసే నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా పాతాలని డిసైడ్ అయిపోయారు. అది కూడా ఆషామాషీగా కాదు.. సీఎం కేసీఆర్‌లా సెకండ్ చాన్స్‌గా కాదు.. తాను కామారెడ్డిలో కేసీఆర్‌ను మట్టి కరిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నానని నామినేషన్ వేసిన విధానంలోనే చెప్పేశారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ బలాన్ని, బలగాన్ని కామారెడ్డిలో చూపించారు రేవంత్‌రెడ్డి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కర్ణాటక మంత్రి బోస్ రాజు ఇలా అందరితో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు రేవంత్ రెడ్డి.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కామారెడ్డికి తీసుకురావడం.. ఆయన చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటించడం.. ఇలా ప్రతి విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్కార్‌పై రాష్ట్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని.. దానికి కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్ ప్రజలే ఉదాహరణ అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొనాపూర్‌కు చెందిన ప్రజలు కొంత డబ్బులను విరాళాల రూపంలో సేకరించి రేవంత్ రెడ్డికి అందించారు. ఈ డబ్బును రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వినియోగించారు. కేసీఆర్ తమకు చేసిందేం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.
తాను కూడా కేసీఆర్‌పై పోటీ ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పారు రేవంత్ రెడ్డి. తాను రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలుస్తానని.. కానీ కావాలనే కామారెడ్డిని రెండో స్థానంగా ఎంచుకున్నానని తెలిపారు రేవంత్ రెడ్డి. ఇక్కడ కేసీఆర్‌ను ఓడించి రాష్ట్ర ప్రజలకు కామారెడ్డి ప్రజలు గులాబీ పార్టీ గులామ్‌లు కాదని తీర్పు చెప్పబోతున్నారని తెలిపారు. అసలు సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను కాదని కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడమే ఆయన ఓటమికి నాంది అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో సరికొత్త అధ్యాయానికి కామారెడ్డి ప్రజలు తెరతీస్తారని.. సీఎం కేసీఆర్ ఓటమి తథ్యమంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.