తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికలో హైడ్రామా కొనసాగుతోంది. రేవంత్ పేరు ఖరారైందనే ప్రచారం వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీకే శివకుమార్ తో సహా ముఖ్యనేతలను ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం సూచించింది. రేపు పార్టీ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో కీలక భేటీ జరగనుంది. అందరితో సంప్రదింపుల తరువాతనే సీఎం అభ్యర్దిని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, తెలంగాణ సీఎంగా చివరికి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.
సీఎం ఖరారులో బిగ్ ట్విస్ట్:తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో సీన్ మారుతోంది. రేవంత్ పేరు ఖరారైనట్లు తొలుత రాష్ట్రంలోని పార్టీ నేతలకు సమాచారం అందింది. అటు అధికారికంగా నిర్ణయం ప్రకటించేందుకు సోనియా తో పార్టీ అధ్యక్షులు ఖర్గే…వేణుగోపాల్ సమావేశమయ్యారు. తెలంగాణలో సామాజిక సమీకరణాలు..సీనియర్లు డీకేతో పంచుకున్న అభిప్రాయాలు చర్చకు వచ్చాయి. రేవంత్ కు సీఎం పదవి ఇస్తే..పీసీసీ, మంత్రి పదవుల కేటాయింపు పైన చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..సీఎం పదవి ఖరారు వేళ ముందుగా ఈ పదవుల పైన స్పష్టత ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం ఖరారు నిర్ణయం వాయిదా వేసారు. వెంటనే ఢిల్లీకి రావాలని డీకే శివకుమార్ తో పాటుగా పార్టీ పరిశీలకులకు ఢిల్లీ హైకమాండ్ సమాచారం ఇచ్చింది.
ఢిల్లీకి ముఖ్య నేతలు:కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ పరిశీలకులు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఖర్గేతో భేటీ అవుతున్నారు. సీఎ పదవి రేవంత్ కు ఇస్తే పీసీసీ చీఫ్ గా ఎస్సీ వర్గానికి చెందిన భట్టికి డిప్యూటీ సీఎంతో పాటుగా ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టేలా సామాజిక ప్రాధాన్యత ఉండాలనే చర్చ మోదలైంది. సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ కు ఎలాంటి పదవులు ఇవ్వాలనేది ఇప్పుడు చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా మంత్రులుగా ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది ఇప్పుడు కసరత్తులో కీలక చర్చగా మారింది. రేవంత్ కు సీఎం పదవి ఇస్తే సీనియర్ల నుంచి రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు రాకుండా..సాఫీగా పాలన..పార్టీ వ్యవహారాలు కొనసాగాలని హైకమాండ్ కోరుకుంటోంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో అందరి ఆమోదంతో సీఎం పదవి తో సహా..ఇతర పదవులను ఖరారు చేయాలని భావిస్తోంది.
ముఖ్యులతో ఖర్గే భేటీ:ఈ రోజు సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం ఉంటుందనేది ఉదయం నుంచి ప్రచారం సాగింది. తాజా పరిణామాలతో ఈ రోజు అధికారిక ప్రకటన పైన సస్పెన్స్ కొనసాగుతోంది. రేవంత్ మద్దతు దారులు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రేవంత్ కే అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేసులో ఉన్న సీనియర్లు కూడా లాబీయింగ్ ముమ్మరం చేసారు. సమయం దొరకటంతో తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ సీఎంగా రేవంత్ పేరునే ప్రకటిస్తారా..లేక కర్ణాటక తరహా ఫార్ములా అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో, కొత్త సీఎంను ప్రకటించిన తరువాత ఈ నెల 6న లేదా 9న ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కనిపిస్తోంది.