TELANGANA

సీఎం రేవంత్‌రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని ఎందుకు లేఖ రాసింది.. అందులో ఏముంది?

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో వరుసగా ఒక్కో గ్యారంటీని అమలు చేసుకుంటూ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాధనంతో నిర్మించిన అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి రోజు నుంచి ప్రజాభవన్‌లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలు,అభ్యర్థలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ ప్రజావాణికి విశేష స్పందన లభిస్తోంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను తీర్చాలంటూ రేవంత్‌ సర్కారుకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

 

More

From Telangana politics

మా స్కూల్‌కు ఉచిత విద్యుత్‌ ఇవ్వండి..

అలాగే గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రతీ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుని వాటిపైన సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి ఐదో తరగతి విద్యార్థిని ఒక లేఖ రాసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి గుర్తుచేస్తూ ఆ లేఖలు ప్రస్తావించింది. ఆ విద్యార్థిని తన పుట్టిన రోజున గిఫ్ట్‌గా ఓ కోరిక కూడా కోరింది. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి నమస్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూల్‌కు ఉచిత విద్యుత్‌ అందించాలని మనవి.’’ అని కోరుతూ అంటూ లేఖ రాసింది.

 

ఆదిభట్ల విద్యార్థిని..

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన 5వ తరగతి విద్యార్థిని అంజలి తన పుట్టిన రోజు సందర్భంగా ఈ లేఖ రాసి సీఎం రేవంత్‌ రెడ్డికి పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ లెటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ చిన్నారి లేఖపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎంతో ధైర్యంగా సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాసి తన కోరికను తెలియజేసినందుకు చిన్నారిని పలువురు అభినందిస్తున్నారు. మరి ఈ లేఖపై సీఎం రేవంత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

గతంలో కూడా..

సమాజంలో ఉన్న సమస్యలపై చాలా మంది ప్రభుత్వాలకు, అధికారులకు లేఖలు రాస్తుంటారు. కొందరు ప్రధాని, కేంద్ర మంత్రులకు కూడా లేఖలు రాస్తుంటారు. ఇక లోకంపై అవగాహన లేని చిన్నారులు కూడా తమ సమస్యలను ప్రధాని, ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్తుంటారు. గతంలో మహబూబ్‌నగర విద్యార్థులు తమ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించేలా ఆదేశించాలని హైకోర్టుకు లేఖ రాశారు. గతంలో ఇలా ప్రధాన మంత్రికి లేఖలు రాసిన ఘటనలు అనేకం ఉన్నాయి. వాటిపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న హరీష్‌ రావు వద్ద ఓ చిన్నారి గిరిజన వేషంలో వేసి జాతకం చెప్పింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.