TELANGANA

బీజేపీకి 10 సీట్లు, తెలంగాణలో భారీ స్క్రీన్లలో రామ మందిర ప్రారంభోత్సవం: కిషన్ రెడ్డి..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) ధీమా వ్యక్తం చేషశారు. 10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్న బీజేపీ.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరయ్యారు.

 

బీజేపీ ముఖ్య నాయకులు బండి‌ సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. బీజేపీ శాసనసభా పక్షనేత ఎన్నికపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి తర్వాత జాతీయ స్థాయిలో ప్రచారాన్ని వేగవంతం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలు, వర్గాల వారీగా సమావేశమై ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన అంశాలను సేకరిస్తామని, నూతనంగా ఓటు హక్కు పొందిన యువతను స్వయంగా వెళ్లి కలుస్తామన్నారు. సంక్రాంతి నుంచి 22వ తేదీ వరకు దేవాలయాలను పరిశుభ్ర పరిచేందుకు స్వచ్ఛ అభియాన్ పేరిట కార్యక్రమం చేపట్టనున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు.

 

రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో తెలంగాణ భాగస్వామ్యం కావాలని నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా ప్రతి దేవాలయంలో భారీ తెరలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 22న దేశమంతా రామజ్యోతులతో కళకళలాడాలని రామజన్మ భూమి ట్రస్ట్ పిలుపునిచ్చిందని.. రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ సహకరించాలని కిషన్రెడ్డి కోరారు.

 

రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) తెలంగాణకు రానున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని కిషన్రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ధాటిని తట్టుకోలేక రాహుల్ గాంధీ కాంగ్రెస్అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇంచార్జీలను నియమించనున్నట్లు, ఆర్గనైజేషన్ఇంచార్జీలను మంగళవారం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమన్వయం కోసం పార్లమెంట్ కన్వీనర్లను నియమించనున్నట్లు తెలిపారు.

 

ఇప్పటికే తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీ‌లను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి, సీనియర్‌ నాయకులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ ఇన్‌ఛార్జ్‌గా రాజాసింగ్, సికింద్రాబాద్ ఇన్‌ఛార్జ్‌గా ఎంపీ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించారు.నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, చేవెళ్లకు ఏవీఎన్రెడ్డిని నియమించారు. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి చింతల రామచంద్రారెడ్డికి, భువనగిరికి ఎన్వీఎస్ఎస్ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించారు.

 

జహీరాబాద్‌కు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, మెదక్‌కు పాల్వాయి హరీశ్‌బాబును నియమించారు.మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి గరికపాటి మోహనరావు, ఖమ్మంకు పొంగులేటి సుధాకర్ రెడ్డి, వరంగల్ స్థానానికి మర్రి శశిధరరెడ్డిని నియమించగా.. కరీంనగర్ బాధ్యతలు ధనపాల్ సూర్యనారాయణ గుప్తాకు అప్పగించారు. కాగా, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉందని.. బీఆర్ఎస్ నామమాత్రమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.