TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు..

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ తాజాగా ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశాల మేరకు ఫేజ్ 2 రూట్ మ్యాప్ను సిద్దం చేసిన మెట్రో అధికారులు, 70 కిలో మీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.

 

హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, సిటీలోని నలుమూలాలకు అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్ కనెక్ట్ అయ్యేలా కొత్త ప్రతిపాదిత మార్గాలను తయారుచేశారు. దీంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మెట్రో రైలు ప్రయాణం మరింత చేరువయ్యే అవకాశం ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు.

 

హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు అందుబాటులో ఉంది. ఈ మార్గాల్లో నిత్యం లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.

 

అయితే మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్(JBS) నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్‌ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నారు. దీంతోపాటు మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడిగించనున్నారు.

 

మరోవైపు, ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లకు విస్తరించనున్నారు. ప్రతిపాదిత కారిడార్ 4 లో భాగంగా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు మీదుగా మైలార్ దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మొత్తం 29 కిలోమీటర్ల వరకు కొత్తగా మెట్రోమార్గాన్ని సిద్ధం చేయనున్నారు.

 

ఈ కారిడార్‌లో మైలార్ దేవ్పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు రూట్ మ్యాప్ ఖరారైంది. కారిడార్ 5లో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) వరకు 8 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులోకి రానుంది.

 

ఇక, కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని విస్తరించనున్నారు. కారిడార్ 7లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు 8 కిలోమీటర్లు కొత్తగా మెట్రోరైలు మార్గానికి రూట్ మ్యప్ సిద్ధమైంది. కొత్తగా 70 కిలో మీటర్లు మేర సిద్ధం చేసిన రూట్ మ్యాప్ పై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్నిప్రకటించనుంది.