తెలంగాణలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ప్రధానంగా బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఫిబ్రవరి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
ఫిబ్రవరి 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, ఫిబ్రవరి 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టి, 12 వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 4న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌పై చర్చించనున్నారు.వివిధ శాఖలు ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాయి.
ఓటాన్ అకౌంట్ అకౌంట్‌కు, గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలపడంతో పాటు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు కొత్త పథకాలపై మంత్రివర్గం చర్చించనుంది. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాలపై ప్రధానంగా సమీక్ష నిర్వహించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు.
ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది? ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్‌లోనే వాటికి నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి ఆర్థికశాఖకు సూచించారు. శాసనసభ సమావేశాల్లోపు మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ రెండు పథకాలతో పాటు, గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితోపాటు రుణాలపైనా చర్చించనున్నారు.