TELANGANA

హరీశ్ రావు సీఎం కావాలంటే ఏం చేయాలో చెప్పిన రేవంత్ రెడ్డి..

గత ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడంపైనే దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని సీఎం రేవంత్ తెలిపారు. గత రభుత్వ పదేళ్ల అన్యాయాలను గుర్తించిన ప్రజలు.. వారిని గద్దె దింపారని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కుటుంబం ఉద్యోగాలు ఊడగొట్టినందుకే మీకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. 3650 రోజులు అధికారంలో ఉన్న కేసీఆర్ కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదని విమర్శించారు.

 

మేడిగడ్డ పేక మేడలా కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు రేవంత్. సాగునీటి ప్రాజెక్టులపై రూ. 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని మండిపడ్డారు. కాగ్ నివేదికను సభలో పెట్టామన్నారు. శాసనసభలో ప్రాజెక్టులపై చర్చపెడితే మాజీ సీఎం కేసీఆర్రాకుండా పారిపోయారని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్లు పదవిలో ఉన్న వ్యక్తి అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు.

 

పదవి కోసం ఔరంగజేబు తన తండ్రిని జైలులో పెట్టారని గుర్తు చేశారు రేవంత్. ఈసారి హరీశ్రావుకు పదవి రావాలంటే మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి చురకలంటించారు. 3650 రోజులు అధికారంలో ఉండి ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదని.. కానీ, కాంగ్రెస్వచ్చిన 70 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ తెలిపారు. త్వరలోనే గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నామన్నారు.

 

ప్రాజెక్టుల విషయంలో తన సలహాలు తీసుకోవాలని కేసీఆర్చెబుతున్నారు, అందుకే ఆయన సలహాలు తీసుకోవాలనే అసెంబ్లీకి రమ్మని చెబుతున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సీఎం కుర్చీలో నల్లమల నుంచి వచ్చిన రైతుబిడ్డ కూర్చుంటే కేసీఆర్ఓర్వలేకపోతున్నారని రేవంత్ ఆగ్రహించారు. వాస్తు బాగోలేదని సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టారని, ఆయన సరిచేసిన వాస్తు తమకు అక్కరకు వచ్చిందన్నారు. కేసీఆర్దశ బాగోలేకనే ఫాంహౌస్‌కు వెళ్లాల్సి వచ్చిందని రేవంత్ ఎద్దేవా చేశారు.