తెలంగాణ కుంభమేళ మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మంది జాతరకు వెళ్లి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను (Sammakka Saralamma Jatara 2024) దర్శించుకుని బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ఈ బస్సులను ఆదివారం నుంచి ఫిబ్రవరి 25 వరకు నడిపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను నడిపిస్తోంది. ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ(TSRTC) అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
గత జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా 1.50 లక్షల మందికి పైగా భక్తులు చేరవేశారు. తాజా ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈసారి భక్తులు ఎక్కువగా వస్తారని భావిస్తోంది. ఇప్పటికే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో అధిక సంఖ్యలో మేడారానికి తరలి వస్తున్నారు. దీంతో మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి.
కాగా, మేడారంలో ఆర్టీసీకి కేటాయించిన స్థలంలో మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో బస్పార్కింగ్, అధికారులకు వసతి, తాగునీటి సౌకర్యం, క్యాంటీన్, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు బస్సులు తిరిగి వెళ్లే క్రమంలో విశ్రాంతి తీసుకునేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బస్సుల సంఖ్య పెంచగా, కార్మికులు పెరుగుతుండటంతో గతంలో రెండు ప్యూరిఫైడ్వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయగా, ఈసారి నాలుగింటిని ఏర్పాటు చేశారు.