తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న సీఎం.. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఇక్కడ్నుంచే ప్రారంభించినట్లు గుర్తు చేశారు.
మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు రాకుండా రూ. 110 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. మేడారం జాతరపై కేంద్రం వివక్ష చూపడం సరికాదన్నారు. జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లుగా పత్రికల్లో చూసినట్లు చెప్పారు. కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోందన్నారు. రూ. వందల కోట్లు విడుదల చేసిందని చెప్పారు. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు మాత్రం కేవలం రూ. 3 కోట్లు కేటాయించిందని సీఎం రేవంత్ తెలిపారు.
అయోధ్యలోని రాముడిని దర్శించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా చెప్పారు.. ఆ మాదిరిగానే మేడారం జాతరను వారిద్దరూ వచ్చి దర్శించుకోవాలన్నారు సీఎం రేవంత్. వారిని అధికారిక హోదాలో స్వాగతం పలికే బాధ్యతను తాను, తన మంత్రివర్గం చూసుకుంటుందన్నారు. మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమంటూ కిషన్ రెడ్డి ఆదివాసీలను అవమానించొద్దన్నారు. గత సీఎం కేసీఆర్ మేడారం సందర్శించుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారన్నారు రేవంత్. భవిష్యత్తులో మీకూ అదే పరిస్థితి వస్తుందని కిషన్ రెడ్డికి చెబుతున్నట్లు తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ కేసీఆర్‌పై ఒక్క కేసూ ఎందుకు పెట్టలేదని, ఆయన అవినీతిపై విచారణ చేపట్టలేదని.. రేవంత్ ప్రశ్నించారు. త్వరలో విశ్రాంత హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరుపుతామని రేవంత్ చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సమన్వయం, అవగాహన ఉందని ఆరోపించారు. ఏడు సీట్లు కేసీఆర్, 10 సీట్లలో బీజేపీ ఎన్నికలకు వెళ్తున్నాయని రేవంత్ చెప్పారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలో శుభవార్త చెబుతామన్నారు.
ఫిబ్రవరి 27న మరో రెండు గ్యారంటీల అమలు
రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్. త్వరలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ను నియమించి.. జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.