TELANGANA

ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం..

ఔటర్ రింగ్ రోడ్డు(ORR) ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్లలో అవకతవకలపై విచారణ చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టోల్ టెండర్ల పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణను సీబీఐ లేదా మరో సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

 

బుధవారం హెచ్ఎండీఏ భవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర నివేదిక హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు. అవసరమైతే బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.

 

 

మరోవైపు, ఇటీవల ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్న కేసులో రెరా కార్యదర్శి, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్ మెంట్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ కేసులో దాదాపు రూ. 500 కోట్ల అవినీతి బయటపడింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

 

ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ఆర్‌కు రేడియల్ రోడ్లు

 

ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR)కు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో హెచ్ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ -2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలను ఒకే యూనిట్‌గా అభివృద్ధి చేయాలన్నారు. ఓఆర్ఆర్ – ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలన్నారు.