నేడు మహాశివరాత్రి పర్వదినం.. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగి పోతున్నాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.. అలాంటి పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. పరమశివుడు విశ్వవ్యాప్తమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. అటువంటి మహాశివరాత్రి పర్వదినం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ఘనంగా జరుగుతుంది.
వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో, శివనామస్మరణతో మారుమోగిపోతుంది. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి వేములవాడలో కన్నుల పండుగగా మహా శివరాత్రి జాతర ప్రారంభం అయింది. విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని విశేషంగా ముస్తాబు చేశారు.
జాతర ఏర్పాట్లతో వేములవాడ పట్టణం నూతన శోభను సంతరించుకుంది. ఈ రోజు తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయం వద్ద కిటకిటలాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను నిన్న రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహాశివరాత్రి జాతర వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాల నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు. ధర్మగుండంలో కొత్త నీటిని నింపడమే కాకుండా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
ప్రధాన రహదారుల వెంబడి స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఒక పండుగ వాతావరణం, ఒక ఆధ్యాత్మిక సంస్కృతి ఉట్టిపడేలా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వేములవాడ రాజన్న ఆలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ఉన్న నేపథ్యంలో వేములవాడ జాతర ఎక్కువ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను వివిధ డిపోల నుంచి నడుపుతున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులు జాగరణ చేసేందుకు పెద్ద ఎత్తున చలువ పందిళ్లు, షామియానాలు వేశారు. పార్కింగ్ స్థలంలో తాత్కాలిక మరుగుదొడ్లు, జల్లు స్నానాలకు టాప్ లు ఏర్పాట్లు చేశారు.