వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 16,17,18 వ తేదీల్లో తెలంగాణకు ఆయన రానున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్‌గిరిలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశముందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.
అంతేగాక, మూడు లోక్‌సభ స్థానాలు కవర్ చేసే విధంగా ఒక్కో సభ పెట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఇప్పటికే ఇటీవలిప్రధాని మోడీ రెండురోజుల పర్యటనతో కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ తర్వాత టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. ఏయే తేదీల్లో పర్యటించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. మోడీ మూడు పర్యటనల్లో భాగంగా చివరి విజిట్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ల పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు పార్లమెంట్(హైదరాబాద్, సికింద్రాబాద్) స్థానాల పరిధిలో ఓటర్లను బీజేపీ వైపునకు తిప్పుకోవడంపై బీజేపీ దృష్టి సారిస్తోంది. కాగా, మరోవైపు మంగళవారం (మార్చి 12న) కేంద్రమంత్రి అమిత్‌షా తెలంగాణకు వస్తున్నారు. ఆయన ముందుగా సోషల్ మీడియా వారియర్స్‌తో సమావేశం కానున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోడీ నాయకత్వంలో పెరిగిన దేశ ప్రతిష్ట తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సలహాలు సూచనలు చేయనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బూత్ అధ్యక్షులు, నేతలతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 25 వేల మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.