TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కీలక పరిణామం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వార్ రూములను ఏర్పాటు చేసి రాజకీయ నాయకుల, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి, రకరకాల సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసు ఉన్నతాధికారుల నుండి, కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తాజాగా జరుగుతున్న విచారణలో తెలుస్తుంది.

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బులను ఎన్నికల కోసం వాహనాలలో తరలించారని, ఎన్నికల సమయంలో పోలీస్ అధికారుల ముఠా వాహనాలలోనే అధికార పార్టీకి చెందిన డబ్బు తరలింపు జరిగిందని ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు న్యాయవాది సురేష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 

ఈడీ రంగంలోకి దిగితే అసలు నిందితులు బయటకు వస్తారు నేడు ఆయన ఈడీకి చేసిన ఫిర్యాదులో ఈడి రంగంలోకి దిగితేనే ఇందులో దాగున్న మనీలాండరింగ్ వ్యవహారం బయటకు వస్తుందని పేర్కొన్నారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్న అడ్వకేట్ సురేష్ ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించ లేదని, ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తే అసలు నిందితులు బయటకు వస్తారని తన ఫిర్యాదులో తెలిపారు.

 

నిందితులు ఫోన్ ట్యాపింగ్ తో కోట్లాది రూపాయలు వసూలు చేశారు రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేశారని, ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించారని నిందితులు విచారణలో స్వయంగా ఒప్పుకున్నారు అని పిటిషన్ లో పేర్కొన్నారు.

 

ఈడీ ఎంట్రీ ఇస్తుందా? ఈ డి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిర్యాదు నేపథ్యంలో ఈడి ఎంట్రీ ఇస్తుందా? ఒకవేళ ఈ కేసులో ఈడి ఎంటర్ అయితే ఎలా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.