దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాలం కలిసి రావడం లేదు. ఆమె ఏ కోర్టుకు వెళ్లిన చుక్కెదురే అవుతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఒకపక్క ఈడీ విచారణ తో పాటు, మరోపక్క సిబిఐ కూడా విచారణకు రెడీ అవ్వడంతో ఎమ్మెల్సీ కవిత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
కవిత సీబీఐ విచారణ పిటీషన్ వాదనలు తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సిబిఐ తనను ఇంటరాగేషన్ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. అయితే కోర్టులో నేడు వాదనల సందర్భంగా కవితను ఏప్రిల్ 6వ తేదీన తీహార్ జైల్లో సిబిఐ విచారించినట్లు, సిబిఐ కోర్టుకు తెలిపింది. అంతేకాదు సిబిఐ కవిత దాఖలుచేసిన పిటిషన్ పై రిప్లై కాపీ ఇవ్వలేదు.
వాదనలు అప్పుడే వినిపిస్తామన్న సీబీఐ దీనికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజాకు సిబీఐ న్యాయవాది తాము ఈ కేసుకు సంబంధించి 26వతేదీన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అయితే కవిత తరపున కోర్టులో వాదించిన రానా, మోహిత్ రావులు సాయంత్రం గత శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆర్డర్ వచ్చిందని అయితే కవితను ఆరవ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకే సిబిఐ విచారించిందన్నారు.
ఆ ఆదేశాలు నిలుపుదల చెయ్యండి : కవిత వాదన ఆర్డర్ రాకుండానే సిబిఐ అధికారులు కవితను విచారించారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ముందుగా విచారించాలి అంటే మరో అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని జడ్జి సూచించారు. తన తరపు వాదనలు వినిపించే వరకు కోర్టు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేయాలని, సిబిఐ విచారించడానికి వీల్లేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
విచారణ ఏప్రిల్ 26కు వాయిదా ఏప్రిల్ 5వ తేదీన తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ విచారించడానికి కోర్టు అనుమతి తీసుకుంది. రానున్న వారం రోజుల్లో ఎప్పుడైనా సరే కవితను విచారించడానికి అనుమతి కావాలని సిబిఐ కోరడంతో కోర్టు దానికి అనుమతినిచ్చింది. అయితే తనకు నోటీసు ఇవ్వకుండా విచారణ చేయడంపై ట్రయల్ కోర్టుకు వెళ్లిన కవిత, తన విచారణ ఆదేశాలను నిలుపుదల చేయాలని కోర్టును కోరారు. ఈ మేరకు నేడు విచారణ జరగగా కోర్టు ఈ కేసు విచారణను ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు వాయిదా వేసింది.