TELANGANA

రాష్ట్రంలో ధరణి సేవలకు బ్రేక్.. రిజిస్ట్రేషన్ల నిలిపివేత.. !

తెలంగాణ వ్యాప్తంగా ధరణి ద్వారా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. సేవల్లో అంతరాయం తాత్కాలికమైనదేనని పేర్కొన్న ప్రభుత్వం త్వరలోనే ధరణి సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అయితే.. ప్రస్తుత అంతరాయానికి కారణాలేంటంటే..

 

ధరణి పోర్టల్ లో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. దీంతో.. ప్రభుత్వ యంత్రాంగం ధరణి వ్యవస్థపై తీవ్ర కసరత్తులు చేస్తోంది. నిపుణులైన కమిటీల ద్వారా ధరణిలోని వ్యవస్థీకృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ధరణిని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపణ నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అలాంటి సమస్యలు, విమర్శలకు ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

న్యాయ నిపుణులు, భూ వ్యవహారాల నిపుణులు, రెవెన్యూ సీనియర్ అధికారులతో పాటు.. క్షేత్రస్థాయిలో రైతులు, భూముల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. వీరు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరికొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా.. ప్రస్తుతం ధరణిలోని లోటుపాట్లను సరిదిద్ది రైతులకు అనుకూలంగా మలచటంలో ఈ కమిటీలు నిమగ్నమైయ్యాయి.

 

ఈ చర్యల్లో భాగంగానే ధరణి పోర్టల్ డేటాబేస్ వెర్షన్ అప్డేట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 05 గంటల నుంచి అప్డేట్ ప్రక్రియ మొదలు కానుందని తెలిపిన ప్రభుత్వ అధికారులు సోమవారం అంటే 16 డిసెంబర్ 2024 ఉదయం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సమయంలో ధరణి పోర్టల్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ సమయంలో జరగదని, ధరణి పూర్తిగా అందుబాటులో ఉండదని.. ఈ విషయాన్ని రాష్ట్రంలోని రైతులు, ప్రజలు, ఇతర వర్గాల వారు గుర్తించాలని ప్రభుత్వం కోరింది.

 

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికే అనేకమార్లు ధరణి పోర్టల్ విషయమై చర్చలు జరిపారు. ఈ మంత్రత్వ శాఖల అవసరాల మేరకు పోర్టల్ ను రూపొందించనుండగా.. ఇందులోని ప్రతి విభాగం రైతులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేలా రూపొందించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

 

గతంలో మాదిరి నిషేధ జాబితా నుంచి భూముల తొలగింపు, చేర్పులు, దేవాదాయ భూముల జాబితాలో మార్పు చేర్పులు, సహా అనేక రకాల వ్యవహారాలపై ప్రభుత్వంలోని నేతలకు స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలోని ప్రభుత్వంలో అలాంటి వాటికి అవకాశాలు లేకుండా ధరణి పోర్టల్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దశాబ్దాల నాటి భూముల క్రయావిక్రయ దస్తావేజులు కావాలని అడగడంతో.. గతంలో చాలామంది భూములకు రిజిస్ట్రేషన్ జరగ లేదు. వాటి క్రమబద్ధీకరణకు కూడా రానున్న కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది. క్షేత్ర స్థాయిలో భూములపై ఎటువంటి వివాదాల లేనిపక్షంలో.. ఆ భూములను తరాల నాటి నుంచి సాగు చేసుకుంటున్న అసలైన యజమానులను గుర్తించి వాళ్ళకి నూతన పాస్ బుక్ తో పాటు, పట్టా అందించనున్నారు. దాంతో పాటే క్రయవిక్రయ అధికారాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.