ఫార్ములా ఈ-కారు రేస్‌లో మరింత కూరుకుపోయారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.
వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. పెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఫార్ములా ఈ-కారు రేస్ కేటీఆర్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది.
ఇదే కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
ఫార్ములా ఈ రేసులో ఏం జరిగింది? అని చూస్తే.. హైదరాబాద్‌లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్ సెషన్–9 కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్ ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీంతో ప్రమోటర్ గా ఈ సంస్థ తప్పుకుంది.
2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా సెషన్–10 ఈ–కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును తొలగించింది ఎఫ్‌ఈవో. అయితే నాటి మంత్రి కేటీఆర్, ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచుతుందని భావించి.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌లోనే కార్ రేస్‌ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్‌ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్‌ఈవోకు స్పష్టం చేశారు.
ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్‌లో ఎఫ్‌ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణ కోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ రూ.46 కోట్లను ఎఫ్‌ఈవోకు చెల్లించింది. విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేసినందుకు 8 కోట్ల అదనపు పన్ను రూపంలో చెల్లించాల్సి వచ్చింది. దీనికి తోడు మరో కోటి పది లక్షల మేర.. ఫెడరేషన్ ఆఫ్ మోటర్స్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ ఫర్ చేసింది హెచ్ఎండీఏ. ఇలా మొత్తం సుమారు 55 కోట్ల రూపాయల మేర హెచ్ఎండీఏ ఖజానా నుంచి ఖాళీ చేశారు. విచిత్రమైన విషయమేంటంటే.. ఒప్పందంలో హెచ్ఎండీఏ పాత్ర లేక పోవడం గుర్తింంచాల్సిన అంశం.
డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్‌ఈవో సెషన్–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అరవింద్ కుమార్ పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయనకు ఇటీవల మెమో జారీ చేశారు.
ఆ మెమోకు అరవింద్ కుమార్ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్‌ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ.. కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది నోటీసులు జారీ చేసింది.