TELANGANA

రేపో మాపో బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన.. రేసులో మరో ఇద్దరు..

సార్వత్రిక ఎన్నికలు కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉన్నాయా? తెలంగాణలో ఇప్పటివరకు కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎందుకు నియమించ లేదు? రేవంత్ సర్కార్‌ని ఎదుక్కోవాలంటే బలమైన వ్యక్తి కావాలని భావిస్తోందా? రేపో మాపో కొత్త అధ్యక్షుడిపై ప్రకటన రానుందా? మరో ఇద్దరు ఎంపీలు అధ్యక్ష ఈ రేసులో ఉన్నారా? రాజకీయ కోణంలో పరిశీలన చేస్తోందా? అవుననే అంటున్నాయి కమలం వర్గాలు.

 

బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల హడావుడి నడుస్తోంది. ప్రస్తుతం కమిటీల ఎన్నికలపై జోరుగా కసరత్తు సాగుతోంది. ఈసారి దక్షిణాదిపై గురిపెట్టిన బీజేపీ.. కచ్చితంగా తెలంగాణను టార్గెట్ చేసింది. ఎలాగ లేదన్నా డజనకుపైగా సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. సరైన వ్యక్తి కోసం వేట మొదలుపెట్టింది. ప్రస్తుతం కులాల కన్నా, రాజకీయ కోణంలో అభ్యర్థిని ఎంపిక చేయాలన్నది కమలనాథుల ఆలోచనగా కనిపిస్తోంది.

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త సారధి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీకి సంబంధించి ఏ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నా.. కాబోయే అధ్యక్షులు ఎవరనేది దానిపై చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు రేసులోకి వస్తున్నారు.

 

ఇప్పటివరకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, డీకె అరుణ పేర్లు వెలుగులోకి వచ్చాయి. లేటెస్ట్‌గా మరో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిద్దరూ ఎంపీలేనని ఢిల్లీ వర్గాల సమాచారం. ఒకరు ఎంపీ రఘునందన్ రావు కాగా, మరొకరు ధర్మపురి అరవింద్ పేర్లు వెలుగులోకి వచ్చాయి.

 

వీరిద్దరి పేర్లు ఢిల్లీ పెద్దల పరిశీలనలో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. కుర్చీ కోసం ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలకు నిత్యం టచ్‌లో ఉంటూ కావాల్సిన సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై హైకమాండ్ అభిప్రాయ సేకరణ జరుపుతోంది. పార్టీ కోణంలో కాకుండా.. పొలిటికల్ యాంగిల్‌లో కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.

 

ఈ వ్యవహారం పార్టీలో కొందరు సీనియర్ నేతలకు మింగుడు పడడం లేదు. దూకుడుగా వెళ్లే నేత, ఎమ్మెల్యే కన్నా ఎంపీగా ఉన్న వ్యక్తికే ఎక్కువగా అవకాశముందని తెలుస్తోంది. తెలంగాణలో అధిక జనాభా ఉన్న కులాలేంటి? వారికి సంబంధించి పార్టీలో ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారా? లేదా అనేదానిపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల మాట.

 

గతంలో బీఆర్ఎస్ పదేళ్ల రూలింగ్‌లో ప్రజల్లో నెగిటివ్ వచ్చిందని భావిస్తోంది. అందువల్లే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ సర్కార్‌పై ఎదురుదాడి చేయడం అంత ఈజీ కాదన్నది కమల నేతల భావన. మొత్తానికి అన్ని కోణాల్లో ఆలోచించి కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయనుంది. జనవరి ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో బీజేపీ హైకమాండ్ నుంచి ప్రకటన రావచ్చని అంటున్నారు నేతలు.