TELANGANA

ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే.?

తెలంగాణకు పెట్టుబడులకు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందులో భాగంగా విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనవరి 14న నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఫారెన్ టూర్‌కి బయలు దేరనున్నారు.

 

జనవరి 15న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. క్వీన్స్‌లాండ్‌ క్రీడా విశ్వవిద్యాలయాన్ని పరిశీలించనున్నారు. అక్కడ 3-4 రోజుల పాటు పర్యటించనుంది. అక్కడి రేవంత్‌ బృందం జనవరి 19న సింగపూర్‌కు వెళ్లనుంది. తెలంగాణ నుంచి ఆటగాళ్లు ఒలింపిక్స్‌‌కు వెళ్లేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

 

ఆస్ట్రేలియాలో తొలుత క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనుంది సీఎం టీమ్. ఆ తర్వాత సింగపూర్‌ వెళ్లి అక్కడి క్రీడా ప్రాంగణాలు పరిశీలించనుంది. ఒలింపిక్స్‌లో ఆసియా దేశాలకు ఎక్కువగా పతకాలు రావడంతో అటు వైపు దృష్టి పెట్టారు. రీసెంట్‌గా సౌత్ కొరియా వెళ్లి అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీని పరిశీలించిన విషయం తెల్సిందే.

 

సింగపూర్‌ తర్వాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సుకు హాజరుకానున్నారు ముఖ్యమంత్రి. దావోస్‌లో 20 నుంచి 24వ తేదీ వరకు అంటే దాదాపు ఐదు రోజులపాటు సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు జనవరి 21 నుంచి హాజరవుతున్నారు. 23 వరకు దావోస్‌లో పర్యటించనున్నారు.

 

ఈ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం రేవంత్‌తోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఇతర అధికారులు హాజరవుతున్నారు. గతేడాది దావోస్‌ పర్యటన సందర్భంగా సుమారు 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను ప్రభుత్వం పలు కంపెనీలతో కుదుర్చుకుంది.

 

అవి కార్యరూపం దాల్చే ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉన్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పర్యటనలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి టీం ప్రణాళికలను సిద్ధం చేసింది.