తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూస్తున్న ఆ పథకంపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. కొత్త ఏడాదిలో వరుస శుభవార్తలు చెప్పేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
2025 జనవరి నెలలో ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోనుంది. అందులో ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేశారు. సంక్రాంతి పర్వదినానికి ముందుగానే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సబ్ కమిటీ సమావేశంలో, పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి చర్చసాగించారు.
రైతు భరోసా కు సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు తీసుకుని ప్రక్రియ పై సైతం సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు చర్చించారు. కాగా జనవరి 5వ తేదీ నుండి ఏడవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే జనవరి 14వ తేదీ నుండి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, సుమారు 68 లక్షల మందికి లబ్ది చేకూరుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పది ఎకరాల పైన భూమి ఉన్న రైతులు సుమారు 92000 మంది ఉన్నట్లు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం.
మొత్తం మీద ఎప్పుడు ఎప్పుడా అంటూ తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న రైతుబంధు పథకం అమలకు ప్రభుత్వం ముందడుగు వేయడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీని విజయవంతంగా అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు భరోసా పథకాన్ని కూడా పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించింది.