TELANGANA

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరో కీలక నిర్ణయం.. ఈసారి

హైడ్రా (Hydra) కమిషనర్ రంగనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం హైదరాబాద్ నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

 

అయితే, ఫిర్యాదు చేసే ముందు పూర్తి ఆధారాలు, వివరాలతో రావాలని కమిషనర్ రంగాథ్ సూచించారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే 040-295657558, 040-29560596 నెంబర్లను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రంగనాథ్ తెలిపారు.

 

మరోవైపు, మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఓ అక్రమ నిర్మాణంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డును ఆనుకుని ఐదు అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హైడ్రాకు స్థానికులు తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ అక్కడికి వెళ్లి పరిశీలింంచారు.

 

684 గజాల స్థలంలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల్లో భవనం నిర్మాణంలో ఉంది. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజు నోటీసులతోపాటు హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధరించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నిర్మాణంపై పూర్తి వివరాలు పరిశీలిస్తామన్నారు. అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని కమిషనర్ ఆదేశించారు.