దాదాపు 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరంలో రూపుదిద్దుకున్న మరో నూతన రైల్వేస్టేషన్ చర్లపల్లి టెర్మినల్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా ప్రారంభించారు. రూ.428 కోట్లతో ఆధునికీకరించిన ఈ టెర్మినల్ లో తొమ్మిది ప్లాట్ ఫామ్స్, ఐదు ఎస్కలేటర్లు, తొమ్మిది లిఫ్ట్ లు, రెండు ఫుట్ ఓవర్ వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. క్రమక్రమంగా కొన్ని ప్రధానమైన దూర ప్రాంత రైళ్లను ఈ టెర్మినల్ కు మార్చబోతున్నారు. ప్రయాణికులు ఈ స్టేషన్ కు చేరుకునేందుకు ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. అక్కడి నుంచి ఏయే రైళ్లు నడవనున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
చెన్నై సెంట్రల్- హైదరాబాద్- చెన్నై సెంట్రల్ (12603/12604) సూపర్ ఫాస్ట్ ను మార్చి 7వ తేదీ నుంచి చర్లపల్లికి మార్చారు. ఇకనుంచి ఆ రైలు చర్లపల్లి నుంచి ప్రారంభమవుతుంది. చెన్నై నుంచి వచ్చేటప్పుడు చర్లపల్లి వరకే వస్తుంది. అలాగే మార్చి 12వ తేదీ నుంచి గోరఖ్‌పుర్- సికింద్రాబాద్- గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ (12589/12590) కూడా సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మార్చారు.
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే మూడు రైళ్లకు చర్లపల్లి టెర్మినల్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. జనవరి 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.
సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (12757) ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. 8.32కి చర్లపల్లికి చేరుకుంటుంది. ఒక నిముషం హాల్టింగ్ తర్వాత బయలుదేరుతుంది. అలాగే సిర్పూర్‌కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12757) చర్లపల్లికి రాత్రి 7.02 గంటలకు చేరుకొని ఒక నిముషం తర్వాత సికింద్రాబాద్ కు బయలుదేరుతుంది.
గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17201) ఇంటర్ సిటీ మధ్యాహ్నం 12.41కి, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (17202) మధ్యాహ్నం 12.50కి చర్లపల్లిలో ఆగి ఒక నిముషం తర్వాత బయలుదేరతాయి. సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ (17233) మధ్యాహ్నం 3.47కి, సిర్పూర్‌కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17234) ఉదయం 9.20కి చర్లపల్లిలో ఒక నిముషం ఆగి బయలుదేరతాయి. సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు నడుపుతున్న ప్రత్యేక రైళ్లను కూడా చర్లపల్లి నుంచే నడుపుతున్నారు. భవిష్యత్తులో షాలిమార్, హౌరా, సంత్రాగచ్చి, న్యూఢిల్లీ తదితర దూర ప్రాంతాలకు నడిచే రైళ్లను కూడా చర్లపల్లి నుంచి ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.