తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించిన మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఈ పథకం పైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇందిరమ్మ ఆత్మీయ భారోసాపై హైకోర్టులో పిల్
నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పైన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు మాత్రమే వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, పట్టణాలు, పురపాలికల్లో ఉన్న రైతు కూలీలకు ఇవ్వడం లేదని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. వారు కూడా రైతు కూలీలేనని, వారిని ప్రభుత్వం ఎలా విస్మరిస్తుందని ప్రశ్నించారు.
సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 129 పుర,పాలికల్లో ఉన్న దాదాపు 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు నష్టపోతున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామాలలో ఉన్న వారికే పథకాన్ని వర్తింప చేయడం సరైనది కాదని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. అంతే కాదు కేవలం గ్రామాల్లోని వారికే ఈ పథకాన్ని వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటీషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం
ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై నాలుగు వారాల లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు దీనిపైన కౌంటర్ దాఖలు చేయవలసిందిగా కోరింది.
ప్రభుత్వం ఏం చెప్తుంది?
ప్రభుత్వం కోర్టులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పైన ఏ విధమైన వివరణ ఇస్తుంది. పురపాలికలలో కూడా ఈ పథకం అమలు జరిగే అవకాశం ఉందా? ఒకవేళ కాకుంటే కోర్టు ఈ పిటీషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వంటి అనేక అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా ఈ పిల్ పై ఏం జరుగుతుందో హైకోర్టు విచారణ ద్వారా తేలనుంది.