TELANGANA

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ కమిషనర్‌ను పౌరసరఫరాల శాఖ సూచించింది. కాగా, కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

 

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డుల జారీ ప్రారంభించిన సమయంలో.. ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు లక్ష కార్డులను పంపిణీ చేసింది. అయితే, చాలా మంది కొత్త రేషన్ కార్డులు కావాలని, ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నారు.

 

కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులు, చిరునామా మార్పులు, ఇతర మార్పులు అవసరమైనా.. వాటిని కూడా మీసేవలో ఆన్‌లైన్ ద్వారా సులభంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రజలు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాలను సందర్శించి తమకు అవసరమైన మార్పులు, కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

 

రేషన్ కార్డులకు సంబంధించిన డేటా‌బేస్‌ను మీ సేవతో అనుసంధానం చేయాలని ఎన్ఐసీని ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారులు ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తులన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దరఖాస్తు చేయని వారు మాత్రమే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటకే ప్రభుత్వం విడుదల చేసింది.

 

కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, దీనికి నిర్దిష్ట గడువు ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అర్హత కలిగిన ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని తెలిపింది.