మెరుగైన కుటుంబ నియంత్రణ విధానాలను అవలభిస్తున్నందుకు దక్షిణాధి రాష్ట్రాలను శిక్షిస్తారా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక అంటూ మాట్లాడుతున్న మోదీ.. ఒకే వ్యక్తి – ఒకే పార్టీ అనే రహస్య అజెండాతో పని చేస్తున్నారని విమర్శించారు. మలయాళీ దినపత్రిక మాతృభూమి ఆధ్వర్యంలో కేరళ రాజధాని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సు పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను, మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని సూచించారు.
తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదని, అది 4 కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నమన్న సీఎం.. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తుమంగా నిలపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, 60 ఏళ్ల కలను నెరవేర్చినందున తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో ప్రేమిస్తున్నారన్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసింది ఏం లేదన్న రేవంత్ రెడ్డి.. ఆ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారే తప్ప వాటిని నెరవేర్చలేదని విమర్శించారు.
తెలంగాణను హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు జోన్లుగా విభజించినట్లు తెలిపిన సీఎం.. 160 కిలోమీటర్ల పొడవైన అవుటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాలో 1.2 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉందని వెల్లడించారు. చార్మినార్, హైదరాబాద్ బిర్యానీ, ముత్యాలకు హైదరాబాద్ ప్రసిద్ధి చెందిందని అక్కడి కార్యక్రమానికి హాజరైన వారికి తెలిపారు.
ఓఆర్ఆర్ పరిధిలోని ఈ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెకార్ట్స్‌తో 100 శాతం నెట్ జీరోగా మార్పు చేయాలనే ప్రభుత్వ ప్రణాళికల్ని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. దేశంలోని ముంబయి, దిల్లీ, బెంగళూర్, చెన్నై వంటి నగరాలతోనే కాకుండా ప్రపంచంలోని ముఖ్య నగరాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
రానున్న రోజుల్లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, ఇది పూర్తి హరిత, పరిశుభ్రమైన, అత్యుత్తమమైన నగరంగా ఉండనుందని వెల్లడించారు. ప్రపంచంలోని మరే నగరంతో పోల్చుకున్నా ఇది సరైన ప్రణాళిక, జోన్లు ఉన్న నగరంగా ఉండనుందని తెలిపారు. అలాగే ఇది మొట్టమొదటి నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో AI సిటీని నిర్మిస్తున్నట్లు, యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రూ.1,82,000+ కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకు వచ్చినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. గతేడాది రూ.40 వేల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. అదే గత ప్రభుత్వలోని బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను కూడా సాధించలేకపోయిందని విమర్శించారు. హైదరాబాద్ పర్యావరణ సుస్థిరతకుగానూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. గోదావరి నీటిని మూసీలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా మార్చనున్నట్లు తెలిపారు. అక్కడే 200 ఎకరాల్లో గాంధీ సరోవర్‌ను నిర్మించే ప్రణాళికల్ని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్న సీఎం రేవంత్ రెడ్డి.. పోర్టు అవసరాలు తీర్చేందుకు డ్రై పోర్ట్ నిర్మించనున్నట్లు తెలిపారు. దానిని ఆంధ్రప్రదేశ్‌లోని సీ పోర్ట్ (సముద్ర రేవు)కు ప్రత్యేక రైలు, రోడ్డు మార్గం ద్వారా కలుపనున్నట్లు వెల్లడించారు.